వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి విజ్ఞప్తి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి విజ్ఞప్తి
కాలనీల్లో, బస్తీల్లో కోవిడ్-19 వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని పట్నం ప్రతినిధి బృందం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చైతన్యం కల్పించడానికి ప్రజా, పౌర సంఘాల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించింది.
పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజే నరసింహారావు, రాష్ట్ర నాయకులు మహమ్మద్ అబ్బాస్, డి ఎ ఎస్ వి ప్రసాద్, లోకేశ్ లతో కూడిన పట్నం ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించి పలు సూచనలు చేయడం జరిగింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ తో రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలను మూసివేసినప్పటికి కేసులు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రజలు బయటికి వచ్చి స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకోవడానికి భయపడుతున్నారు. కాబట్టి కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.
"విస్తృతంగా వ్యాక్సిన్స్ వేయడం ద్వారానే కోవిడ్ ను కట్టడి చేయగలమని" సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా లాంటి శాస్త్రవేత్తలు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అరోరా లాంటి డాక్టర్లు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్లు విస్తృతంగా వేయాలని, తద్వారానే కోవిడ్ ను సమర్ధవంతంగా నియంత్రణ చేయగలమని అందువల్ల బస్తీ దవాఖానాలలో, బస్తీలలో, కాలనీలలో విస్తృతంగా కోవిడ్-19 వాక్సిన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, 12 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయాలని కోరారు. అయితే ప్రజలలో వాక్సిన్ గురించి కొన్ని అపోహలు, అపనమ్మకాలు ఉన్నాయని వాటిని దూరం చేయడానికి విస్తృతమైన ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా సంఘాలను, పౌర సంఘాలను విస్తృతంగా వాడుకోవాలని పట్నం రాష్ట్ర కమిటీ సూచిస్తున్నదని అన్నారు. పట్నం కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి వాలంటీర్స్ గా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు
కావున ప్రభుత్వము వెంటనే విస్తృతస్థాయిలో కొవిడ్-19 వాక్సిన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజల్లో చైతన్యం కల్పించడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరడం జరిగింది.