జన్నారం: ఎలాంటి కారణం లేకుండా గ్రామ పంచాయతీ విధుల నుంచి తొలగించారని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే………. మహ్మదాబాద్ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ గా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తనను గ్రామపంచాయతీ తీర్మానం చేసి విధుల నుంచి అకారణంగా తొలగించారని కోండ్రు రాజాం చెబుతున్నాడు. దీనికి నిరసనగా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం గ్రామ సమీపాన ప్రధాన రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనని పంచాయతీ అధికారులు బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే వాటర్ ట్యాంకు పై నుంచి కిందకి దూకి చనిపోతామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పి.సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకు పై నుంచి కిందికి దిగాలని వారితో వారించారు. స్థానిక సర్పంచ్ తనను విధుల్లోకి తీసుకుంటామని చెబితేనే కిందికి దిగుతామని వారు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఎస్ ఐ పి సతీష్ ఎంపీడీవోతో మాట్లాడి తమకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు కిందికి దిగారు.
దీనిపై స్థానిక సర్పంచ్ సునర్ కార్ లక్ష్మణ్ ను వివరణ కోరగా కోండ్రు రాజాంకు 67 సంవత్సరాల వయస్సు ఉందని, ఆయన సక్రమంగా పనిచేయడం లేదని గ్రామపంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులపై తిరగబడుతూ ఇస్తాను రీతిగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే అతనిని ఏప్రిల్ 14వ తేదీన గ్రామసభలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో తీర్మానం చేసి విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు.
