ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోని బస్తీ వాసులకు దారి ఏర్పాటు చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీలో నూతన నిర్మాణాలు, వైస్ ఛాన్సలర్ విధించిన ఆంక్షల కారణంగా దారి మూసుకుపోయి బంధీఖానగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బస్తీ-4, బస్తీ-5 లలో నివాసం ఉంటున్న 300 కుటుంబాలకు యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే దారి ఏర్పాటు చేసి, న్యాయం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని యూనివర్సిటీ అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

ఉస్మానియా యూనివర్సిటీలో దారి మూసుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బస్తీల్లో ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహామ్మద్ అబ్బాస్, ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్ లతో కూడిన ప్రతినిధి బృందం పర్యటించింది.బాధిత కుటుంబాలు పడుతున్న అవస్థలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్
అబ్బాస్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం కాలంలో కూలీలుగా పనిచేసిన కొన్ని కుటుంబాలు వంద సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నాయని, వారితో పాటు యూనివర్సిటీలో కాంట్రాక్టు, డైలీవైజ్ కార్మికులుగా పని చేస్తున్న కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. ఇంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్న వారికి దారి లేకుండా మూసివేయడం అన్యాయం అన్నారు. మంచినీటి ట్యాంకర్లు రావడానికి దారి లేక తాగడానికి నీళ్లు లేవని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎమర్జెన్సీ అంబులెన్స్ లు కూడా రానీయకుండా యూనివర్సిటీ యాజమాన్యం అడ్డుకొంటున్నదని, దీంతో 300 కుటుంబాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం చనిపోయిన శవాలను శ్మశానానికి తీసుకెళ్ళే మార్గం లేదన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే నూతన వధూవరులను వాహనంలో తీసుకురావడానికి అవకాశం లేదని బస్తీవాసులు తమ గోడు వెలుబుచ్చారని అన్నారు. యూనివర్సిటీ ఆవరణలోని మొత్తం 9 బస్తీలలో 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. ఇందులో ఆటోలు నడుపుకుంటూ జీవించేవారు, చిన్న వృత్తులు చేసుకునేవారు, రోజువారీ కూలీలు రెండు బస్తీలలో గణనీయంగా ఉన్నారు. రాకపోకలకు దారి మూసుకుపోయి 300 కుటుంబాలు జైల్లో బంధీలుగా మారిపోయారని, ఏ పనులకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందన, ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ యూనివర్సిటీ కార్యదర్శి మాలోత్ రవి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.