జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో కల రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొని కళ్యాణ లక్ష్మీ,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మరియు సదరన్ సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం తరుపున చెందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు అందేలా, తనవంతుగా తన బాధ్యతను నిర్వహిస్తానని, ఎవరైనా వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్స్ అందకపోతే మళ్ళీ త్వరలో సదరన్ క్యాంపు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తూ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. అతిత్వరలో రాష్ట్ర ప్రజలు పెన్షన్ శుభవార్త వింటారన్నారు.
రాష్ట్రములో పూర్వం 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీ మంజూరు చేసారన్నారు, నిన్న జిల్లా కేంద్రంలో ప్రారంభించిన వందపడకల అసుపత్రి గురించి ప్రస్థావిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేగొండ పీ హెచ్ సి రాష్ట్రములో ఉత్తమ అసుపత్రిగా గుర్తింపు పొంది ప్రైవేట్ అసుపత్రులకు దీటుగా ప్రజలకు సేవలు అందిస్తుందాన్నారు.
ఈ కార్యక్రమంలో రేగొండ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ కమిటీ సంఘాల నాయకులు మరియు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పిఏసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్,తెరాస కార్యకర్తలు,లబ్ధిదారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
