అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి
మృతుని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
కాల్పుల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి.
(సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్ డిమాండ్.)
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో దేశాన్ని తాకట్టుపెట్టే స్కీమ్ అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని, ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష యదావిధిగా నిర్వహించాలని సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివి: 18-06-2022 శనివారం రోజున సిపియం జనగామ జిల్లా, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుండి స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు మోడీ హటావో,.. దేశ్ బచావో నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోఖో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రైవేటీకరణలో మునిగి తేలుతున్న మోడీ సర్కారు దేశ రక్షణకు అవసరమైన సిపాయిలను సైతం కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించడం దేశానికి వినాశకరమని విమర్శించారు. ఆర్మీలో సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయడం మూలంగా సాయుధ బలగాల సామర్ధ్యం దెబ్బతింటుందని అన్నారు. పెన్షన్ డబ్బు ఆదాచేయడం కోసం ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. గత రెండేళ్లుగా రిక్రూట్మెంట్ లేదని, నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఉపాధి లేకుండా పోతారని, అందువల్లనే ఈ పథకం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఇవి కేంద్రం సృష్టించిన నిరసనలని, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్మీలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ యదావిధిగా నిర్వహించాలని తెలిపారు. నిరుద్యోగ యువత జీవితాలతో పాలకులు చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. 15 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం మోసపూరితమని పేర్కొన్నారు. సికింద్రాబాదులో జరిగిన కాల్పుల్లో మరణించిన మృతుడు దామెర రాకేష్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అలాగె గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జిల్లా కమిటీసభ్యులు బూడిద గోపి, జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, పార్టీ నాయకులు కళ్యాణ లింగం, ధర్మభిక్షం, దూసరి నాగరాజు, భాషూపాక విష్ణు, మారెడ్డి వినోద్, గాడి శివ, సిద్ధిరాల ఉపేందర్, పోత్కనురి కనకాచారి., కళ్యాణ్, మోకు విప్లవ్, మాలోత్ తరుణ్. భూక్య యాకన్న తదితరులు పాల్గొన్నారు.