కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ సంస్కరణలపై పోరాటాలకు సన్నద్దం కావాలి.

కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ సంస్కరణలపై పోరాటాలకు సన్నద్దం కావాలి.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపు

కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ సంస్కరణలకు సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నాగెళ్ళ నర్సన్న అధ్యక్షతన ఖానాపూర్ మండలంలోని తర్లాపాడులో జరిగింది. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల విధానాల ఫలితంగా వ్యవసాయరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం సాధించాల్సి ఉంది. విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పంటల కొనుగోలుకు గత సంవత్సరానికంటే 11 వేల కోట్లు తగ్గించింది. ఎరువుల సబ్సిడీ 35 వేల కోట్లు తగ్గించింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఏ నిర్ధిష్టమైన చర్యను ప్రకటించలేదు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి 75 వేల కోట్ల అవసరం ఉండగా 68 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని 6 వేల రూపాయల నుండి 18 వేల రూపాయలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశారు.
2020-21లో రూ.17,465 కోట్లు, 2021-22లో రూ.18,936 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ కేటాయింపులలో రైతుబంధు రూ.10,888 కోట్లు, రైతుబీమా రూ.905 కోట్లు, మార్కెట్‌ జోక్యం రూ.377 కోట్లు, రుణమాఫీ రూ.3,943 కోట్లు కేటాయింపు చేశారు. యాంత్రీకరణకు రూ.1,132 కోట్లు కేటాయింపు చూపినప్పటికీ సన్న-చిన్నకారు రైతులకు యంత్రాలను సబ్సిడీపై ఇవ్వలేదు. రాష్ట్రంలో యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. రుణమాఫీ లక్ష రూపాయలలోపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, 50 వేల లోపు రుణాలు మాత్రమే ఇప్పటి వరకు మాఫీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గత సంవత్సరం 12.63 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం 8.43 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వర్షం వల్ల రూ.2,500 కోట్ల పంటల నష్టం జరిగింది. తామర తెగులు వల్ల మిరప గులాబి పురుగు వల్ల పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీనిని కూడ ప్రకృతి వైపరీత్యాల కిందనే చూడాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఒక ఎకరాకు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మిర్చి రైతులు నష్టపోయారు. కల్తీ విత్తనాల వల్ల, మార్కెట్‌లో కనీస మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అవసరమైన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు పండించుకునే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ప్రణాళిక లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి అవసరమైన పండ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. పాడి రైతులకు సరైనా ప్రోత్సహాలను ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డాకుర్ తిరుపతి, మండల కార్యదర్శి బోసు భూమన్న, పురెడ్డి ఉసన్న, కుమ్మరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.