సిఐటియూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం
కార్మిక హక్కుల సాధన, పరిరక్షణే ధ్యేయంగా నిరంతరాయంగా కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు కొనసాగించేందుకే సిఐటియు ఆవిర్భవించిందని సిఐటియూ జిల్లా అధ్యక్షులు బి. మల్లేశం అన్నారు. సిఐటియు 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ కార్మికులు తమ జీవితాల బాగు కోసం ఎన్నో సమరశీల ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారని అన్నారు. వాటిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులు, చట్టాలు ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ కష్టించి పనిచేస్తూ ఉత్పత్తిని పెంచే శ్రామికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల బ్రతుకుల్లో మార్పు రావడం లేదని, ఉన్న చట్టాలను సైతం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడానికి కొత్తచట్టాలను రూపొందించకుండా ఉన్న హాక్కులను తుంగలో తొక్కి కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాయిలు, అమర్, సుభాష్, అంబన్న, మహేష్ తది తరులు పాల్గొన్నారు.