కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా ధరలు తగ్గేవరకు పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ అన్నారు.
శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో సిపిఎం సమావేశానికి యాదగిరి అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం సామాన్య జనంపై కక్ష కట్టినట్టుగా ప్రజలు వాడే ప్రతి వస్తువు ధరలు పెంచుతుందని ఉప్పు. పప్పు. నూనె. కూరగాయలు రిటైల్ ధరలన్ని సుమారుగా 50 నుండి 60 శాతం మేరకు పెరిగాయన్నారు. పెట్రోల్. డీజిల్ ధరలు అయితే ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు గా రోజుకొకసారి పెరుగుతూ ఉన్నాయన్నారు. జబ్బులు వస్తే వాడుకునే అత్యవసర మందుల పై కూడా ధరలు పెంచి పేదోళ్ళ ఉసురు తీస్తున్నారు అన్నారు. జ్వరం బిపి గుండె మధుమేహం వంటి సామాన్య జబ్బులకు వాడే 850 రకాల మందుల ధరలను 10 శాతానికి పెంచి వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అదనంగా పెరిగిన మందుల ఖర్చు పెనుభారం అవుతుందన్నారు. గృహ వినియోగ గ్యాస్ ధరను సిలిండర్‌కు 50 రూపాయలు పెంచిందని. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరంలో రూపాయలు 500 ఉన్న సిలిండర్ ధర నేడు వేయి రూపాయలు దాటింది అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు సైతం పెరిగాయని అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది అనర్థం అన్నట్లు ఉందని అన్నారు. కోవిడ్ దెబ్బకు అతలాకుతలమైన సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యవసర ధరల సెగ విలవిలలాడుతున్నారని అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సింది పోయి కరెంటు చార్జీలు. బస్ చార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలను 34 శాతం మేర పెంచిందన్నారు. అంతులేని ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం కేంద్ర కమిటీ గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. ఏరియా కమిటీ సభ్యులు మాచర్ల సారయ్య. తదితరులు పాల్గొన్నారు.
