కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.
భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది.
దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అగ్గి రాజేశాడు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. మరీ ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.
దొరల అణిచివేతకు, అరాచకాలు వ్యతిరేకంగా, కౌలు, లెవీ రద్దు చేయాలని, కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయి. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడు. ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది. ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో
కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైంది. కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది. ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్నారు. అదే క్రమంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటరూపం తీసుకున్నది. భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు.
వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయి. గ్రామరాజ్య కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రజలు తమను తాము పాలించుకొని నిజమైన ప్రజారాజ్యాన్ని అనుభవించారు. పదిలక్షల ఎకరాల భూమి పంచుకున్నారు. వెట్టిచాకిరి నుండ విముక్తి పొందారు. ఇంత గొప్ప పోరాటానికి అగ్గి రాజేసింది కాబట్టే కొమురయ్య బలిదానం అజరామరం.
ఆయన చిందించిన రక్తం ఎర్రని లావాలా ప్రవహించి భూస్వామ్యాన్ని దహించి వేసింది.
తెలంగాణ రైతాంగ పోరాట వారసులైన తెలంగాణ ప్రజల్లో ప్రవహిస్తున్న రక్తం ఎర్రగా దగదగ మెరుస్తూనే ఉంది. దానిని ఎవరూ మరో రంగులోకి మార్చలేరు. దగదగ మెరుస్తున్న ఆ రక్తాన్ని భగభగ మండించే నిప్పులకొలిమి కావాలిప్పుడు. ఆ కొలిమిని రాజేసే ఘటన ఎప్పుడైనా, ఎక్కడైనా నిశ్శబ్దాన్ని, నిస్థబ్దతను బద్దలుకొట్టవచ్చు. ఎప్పుడు, ఎక్కడ అనేది చెప్పలేం కానీ బద్దలుకొట్టడం మాత్రం పక్కా. అదే మనకు దొడ్డి కొమురయ్య బలిదానం ఘటన నేర్పిన పాఠం. భూస్వామ్య వ్యవస్థను కూల్చడం, దోపిడీ పీడనలు లేని వ్యవస్థ కోసం జరుగుతున్న పోరాటం కోసం దొడ్డి కొమురయ్య రక్త తర్పణం చేశాడు. ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉంది. దానిని పూర్తి చేసేందుకు అంకిత భావంతో పనిచేయడమే దొడ్డి కొమురయ్య కు నిజమైన నివాళి అవుతుంది.
