సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు తీవ్రంగా ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు.రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చేయలేదేమో… ఇకనైనా కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పాలించడం మానుకోవాలని హితవుపలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని
సీతక్క గారు అన్నారు
