చనిపోయాక ఇచ్చే చేనేత భీమా కాదు, బ్రతికుండగానే వచ్చే చేనేత బంధు కావాలి

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం, రాష్ట్రంలో అనేక కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం చనిపోయాక ఇచ్చే చేనేత భీమా కాదు, బ్రతికుండగానే వచ్చే చేనేత బంధును ప్రకటించాలని, ఇదే నేతన్నకు ధీమా, భరోసా అని, ఈ పథకం కోసం చేనేత కార్మిక కుటుంబాలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయని, చేనేత భీమాతో పాటు చేనేత బంధు ప్రకటించి, చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని, ప్రతి చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడి వర్తింపజేయాలని జనగామ ఎవల్యూషన్ జిల్లా అధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 05-08-2022 శుక్రవారం రోజున జనగామ ఎవల్యూషన్ కమిటి జిల్లా అధ్యక్షులు బిట్ల గణేష్ జనగామ పట్టణ కేంద్రంలోని 12వ వార్డు వీవర్స్ కాలనీలో చేనేత మగ్గాలను సందర్శించి, చేనేత కార్మికులతో వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం బిట్ల గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు భీమా తరహాలో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేనేత భీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నందుకు గాను జనగామ ఎవల్యూషన్ జిల్లా కమిటీ హర్షం ప్రకటిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జనగామ ఎవల్యూషన్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకు చొరవ చూపిన చేనేత జౌళిశాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రపంచీకరణలో భాగంగా చేనేత రంగం శాస్త్రసాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ నేత కార్మికుల జీవితాలలో వెలుగు నింపలేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు అత్యంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని వస్త్ర ఉత్పత్తి లేక, ఉత్పత్తి అయిన వస్త్రాలకు కొనుగోలు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ లేకపోవడం, మరోవైపు ముడిసరుకులకు అధికధరల వల్ల వస్త్రాలు కుప్పలు, కుప్పలుగా పేరుకుపోవడం, చేనేత వస్త్రాలపై జీఎస్టీ పేరుతో బాదుడు అలాగే నిత్యావసర సరకుల ధరలు ఆకాశానంటడంతో రెక్కాడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అనేక మంది కుటుంబాలను పోషించలేక ఉరికొయ్యల ఉచ్చులలో ఆత్మహత్యలు చేసుకుంటూ పిట్టల్లా ప్రాణాలను వదులుతూ కుటుంబాలను చిన్నతనంలోనే వీధులపాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాల కొనుగోలుకు ఎలాంటి ముందడుగు వేయకపోగా, కనీసం కంటి తుడుపు చర్యలకు కూడా ప్రయత్నించలేదన్నారు. మరణించిన నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించే నాథుడే కరువైనారని తెలిపారు. ఇంతటి దారుణమైన ప్రభుత్వ వైఖరిపట్ల నేత కార్మిక కుటుంబాలు అసహనం తెలుపుతున్నారని, నేతకార్మికుల కన్నీటి శాపం వెంటాడి ఈ పాలకులను గద్దెదించే రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత భీమాతోపాటు, నేత కార్మికుల కుటుంబాలకు ఆసరాగా 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చే చేనేత బంధును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిలువఉన్న వస్త్రాలను, ఉత్పత్తి అవుతున్న వస్త్రాలన్నింటిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, వస్త్ర ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకుల ధరలను తగ్గించాలి, వస్త్రాలకు జీఎస్టీ నుండి మినహాయింపును ఇవ్వాలి, ప్రతి చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడి వర్తింపజేయాలి, జిల్లా కేంద్రాలలో వస్త్రాల కొనుగోలు కేంద్రాలను మరియు వస్త్ర ముడిసరుకుల ఉత్పత్తి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మధ్యదళారుల నుండి చేనేత కార్మికులను రక్షించాలని, నిరుద్యోగులకు ఉద్యగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజులలో జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులను ఐక్యం చేస్తూ, రాష్ట్రంలో వారి సమస్యల సాధనకై ఉద్యమించే సంఘాలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేత కార్మికుల హక్కుల సాధన, ఆత్మగౌరవం రోజు జాతీయ చేనేత దినోత్సవం. కనుక ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.