డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

జనగామ పట్టణంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు.

దివి: 23-06-2022 గురువారం రోజున జనగామ పట్టణం బాణాపురంలో మూడవ విడత ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యురాలు ఎం.డి గౌసియా అధ్యక్షతన మూడవ విడత ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2012-13లో జనగామ పట్టణంలో మూడవ విడతలో 1167 మందికి గత ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలిచ్చారని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంకై ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అట్టి లబ్ధిదారుల స్థలాలను ఆక్రమించుకొవడంతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రమించడంతో ప్రభుత్వం దిగొచ్చి 560 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఒక సంవత్సరంలో పూర్తిచేసి అప్పగిస్తామని చెప్పి నేటికీ నాలుగు సంవత్సరాలు అయ్యిందని విమర్శించారు. ఇప్పటికి 250 డబల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రమే ప్రారంభించడం జరిగిందని, కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పగుళ్లు, పర్రెలు, పెచ్చులు ఊడిపోవడం, నిర్మించిన గోడల ఇటుకలు పడిపోవడం వంటివి జరుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్ ఇండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం దుర్మార్గం అన్నారు. సదరు కాంట్రాక్టర్ కు బిల్లులు తప్ప నిరుపేదల ఇండ్ల నాణ్యత ప్రమాణాలు అవసరం లేదనిపిస్తుందని విమర్శించారు. దివి: 29-03-2022 నుండి 01-04-2022 వరకు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెండింగ్ బిల్లులు విడుదల చేసి త్వరితగతిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తిచేసి ఇవ్వాలని రిలే దీక్షలు చేపట్టిన సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయించి లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పి దీక్షలు విరమింపజేసి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎటువంటి పనులు ప్రారంభించకపోవడం పేదలపై ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని, కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి పటిష్టమైన ఇండ్లను నిర్మించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నిరుపేదలైన లబ్ధిదారులు నెలనెలా ఇండ్ల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధలను పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని, కరోనా కాలంలో పనులులేకపోయినప్పటికీ పస్తులుంటూ ఇంటి అద్దెలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చిందని తక్షణమే ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లుల నిధుల విడుదలకు సహకారం చేసి త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బి. చందూనాయక్, మూడవ విడత ఇండ్ల సాధన కమిటీ నాయకులు కల్యాణ లింగం, పొన్నాల ఉమ, నజియా, శాంత, కమల, బాబూరావ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.