దళితబంధు పథకమా (లేక) గులాబీలూటీ పథకమా?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ (కెసిఆర్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల ఆర్థికాభివృద్ధికి తీసుకొచ్చిన దళితబంధు పథకం నిరుపేద దళితుల జీవితాలలో ఆర్థికప్రగతికి దోహద పడుతుందనుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జోక్యంతో దళితబంధు పథకం టిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులకు, బందువులకు, పార్టీ ముఖ్య కార్యకర్తలకు గులాబీలూటీ పథకంలా మారిందని, అలాగే ఈ దళితబంధు పథకం ఎంపికలో దళిత వికలాంగుల ప్రస్తావనే మరిచిందని తక్షణమే ఎంపిక చేసిన జాబితాను రద్దుచేసి గ్రామాల వారీగా నిరుపేద దళితులను, 2016 చట్టం ప్రకారం దళిత వికలాంగులకు కేటాయించిన వాటా ప్రకారం మళ్ళీ ఎంపిక జరిపి అర్హులైన వారికి దళితబంధు వర్తింపచేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 30-03-2022 బుధవారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ ఆవరణలోని జూబ్లీ హాల్ నందు ఎన్పిఆర్డి జనగామ జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ లో కేవలం 17, 700 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమం కోసం కేటాయించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం జనగామ జిల్లాలో కొన్ని మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు, బందువులకు, ముఖ్యకార్యకర్తలకు ఈ పథకం వర్తింపజేస్తూ అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో మొత్తం 60818 దళిత కుటుంబాలు ఉంటే కేవలం మొత్తంగా దళితబంధు పథకం కింద 194 మందిని ఎంపిక చేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దళితులు వేలసంఖ్యలో ఉండగా అతితక్కువ మందిని ఎంపిక చేయడంపై మిగతా దళితులలో ఆందోళన, గందరగోళం ఏర్పడుతుందన్నారు. ఇప్పటివరకు దళితబందులో దళిత వికలాంగుల వాటా ప్రకటించకపోవడంతో ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష చూపుతుందనే సందేహం, అనుమానం కలుగుతుందని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 37(బి) ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని, అలాగే సెక్షన్ 24(1) ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్దిలో 25 శాతం అదనంగా వికలాంగులకు ఇవ్వాలని తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన వారిలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ ముఖ్య కార్యకర్తలకు అధికారపార్టీ అండదండలున్న వారికే దళితబందు వర్తింపజేస్తున్నారని విమర్శించారు. ఇది దళితబందు పథకమా లేక టిఆర్ఎస్ పార్టీ కుటుంబ, కార్యకర్తల గులాబీలూటీ పథకమా అని ప్రశ్నించారు. తక్షణమే దళితబంధు పథకంలో ఎంపిక చేసిన జాబితాను రద్దుచేసి మళ్ళీ గ్రామగ్రామాన అసలైన అర్హులను నిరుపేద దళితులను ఎంపిక చేయాలని మరియు దళితబంధు పథకంలో అర్హులైన వికలాంగ దళితులకు వారి వాటా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఎంపిక చేయాలని తెలిపారు. ఈ దళితబంధు పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జోక్యం లేకుండా ప్రతిఘటించాలని తెలిపారు. ఇలాగే ప్రభుత్వం మొండిగా కొనసాగించాలని చుస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడెం రాములు, తోట సురేందర్, ఉప్పరి వేణు, బండవరం శ్రీదేవి, మామిడాల రాజేశ్వరి, ఇట్టబోయిన మధు, ఆకారపు కుమార్, మాలోతు రాజ్ కుమార్, మోతే వెంకటమ్మ, ఎడ్ల రమాదేవి, పులి మంజుల, పిట్టల కుమార్, పులిగిల్ల రాజయ్య, బైరగోని మహేష్, రావుల శ్రీనివాస్, కానుగు బాలనర్సయ్య, నాచు అరుణ, ఒండ్రు శ్రీశైలం, గొడుగు రాజవ్వ, పిట్టల రజిత తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.