ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకొని సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోకి వచ్చే జనగామ జిల్లా కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రాల్లో ఆయా మండలాల దళిత, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దళితబంధు కార్యక్రమం అమలుపై సమీక్ష చేశారు.
షెడ్యూల్డ్ కులాల కుటుంబాల లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల ఎంపిక తదుపరి వారికి శిక్షణ, పెట్టబోయే పథకంపై లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల ఈ పథకాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి అని మంత్రి తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని 17 లక్షల మంది దళితులకు వచ్చే మూడు నాలుగు ఏళ్ళలో ఆర్థిక సహాయాన్ని అందించినున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకం అమలుకు 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు.