ఎస్పి జె. సురేందర్ రెడ్డి
E69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి:
దివంగత పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రేగొండ ఏఎస్ఐ బానోత్ హరిలాల్ నాయక్ సతీమణి సరోజనకు లక్షరూపాయల చెక్కును ఎస్పి అందజేశారు. అనంతరం ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. దివంగత పోలీసుల పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, దివంగత పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎస్పి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, జిల్లా ఇన్చార్జి ఓఎస్డి పి. శోభన్ కుమార్ డిపిఓ ఏఓ ఆయుబ్ ఖాన్, డిపిఓ సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, దివంగత పోలీసు హరిలాల్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.