దేశములో మహిళలకు రక్షణ ఏదీ ? అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై, మహిళలపై, జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులకు వ్యతిరేకంగా యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా బేతంచర్ల మండల అధ్యక్షురాలు కటికె భాను ఆధ్వర్యంలో స్థానిక బేతంచర్ల మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. మహిళా ఐక్య వేదిక బేతంచర్ల నాయకురాలు జిల్లా కార్యదర్శి వడ్డే సరస్వతీ అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ , వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పసిపిల్లలపై, చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు హత్యలు, దాడులు రోజు రోజుకు పెరిగిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ వున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయాన్ని అందించడంలో కూడా పాలకులు వివక్షత చూపించడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాదులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అత్యాచారానికి హత్యకు గురైతే పోలీసులు, పాలకులు ఏకమై న్యాయస్థానాలతో పని లేకుండా శిక్షలు విధిస్తారు, అదే యస్సీ యస్టీ బిసి మైనార్టీ సామాజిక వర్గాల అమ్మాయిలపై, చిన్నారులపై, పసిపాపలపై అత్యాచారాలు హత్యలు దాడులు జరిగితే మాత్రం పోలీసులు పట్టించుకోరు, పాలకులు స్పందించరు అని అసలు దేశంలో ఏం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి వడ్డే సరస్వతీ మాట్లాడుతూ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన హక్కులను, స్వేచ్ఛను కాలరాసి తిరిగి మహిళలను వంటింటికి పరిమితం చేయాలనే కుట్రలు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఒక వైపు మహిళల సంక్షేమం, మహిళల అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులకు మహిళలపై జరుగుతున్న హింస కనబడటం లేదా? అని ఆమె అన్నారు. నిజంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన నేరాలను త్వరితగతిన విచారించి నిందితులను శిక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక ఫాస్టుట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని,అందులో మహిళా జడ్జిలను నియమించాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీసుస్టేషన్ ను ఏర్పాటు చేసి మహిళా పోలీసు అధికారులను నియమించాలని ఆమె డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రతి పాఠశాలలో జెండర్ పై ప్రత్యేక శిక్షణను విద్యార్థులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో వున్న రుగ్మతలను పొగొట్టకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు దాడులను అరికట్టలేరని ఆయన తెలిపారు.ధర్నా అనంతరము బేతంచర్ల M.R.O గారు అందుబాటులో లేకపోవడంతో ఆర్.ఐ.శ్రీదేవి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి నాయకులు ప్రతాప్ ,రాజేష్ , రియాజ్ , విద్యార్థినులు మరియు మహిళా ఐక్య వేదిక సభ్యులు కులుసుంబీ, లక్ష్మీ , జయమ్మ , లక్ష్మిదేవమ్మ , సుగుణమ్మ , యంబాయి లక్ష్మిదేవి, చాకలి జయమ్మ , ఫకూరుబీ, ఎల్లమ్మ , లక్ష్మీదేవి, రామక్క , జి.రంగమ్మ , సరస్వతీ, నాగమ్మ , మద్దిలేటమ్మ , ఆనందమ్మ , నాకలక్ష్మమ్మ తదితరలు పాల్గోన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.