Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

(సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ డిమాండ్.)

త్రివిధ దళాల్లో సైనికుల నియామకం కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ డిమాండ్‌ చేశారు.

దివి: 22-06-2022 బుధవారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అగ్నిపథ్‌తో దేశ రక్షణ, భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ దిశలో పలువురు మాజీ సైనికాధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అగ్నిపథ్‌ను రద్దు చేయాలన్నారు.

సబ్‌కా వికాస్‌, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క హామీని నిలుపుకోలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు. ఎక్కడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని మోడి ప్రభుత్వం చివరకు సైన్యంలో చేరే వారికి కూడా పెన్షన్‌ లేకుండా, నాలుగేళ్ల కాలపరిమితికి తీసుకుంటామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్‌ సైనికులు, వారి కుటుంబాల భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించారు. ఆతర్వాత వారు సెక్యూరిటీ గార్డులుగా, దోభీలుగా, బార్బర్‌లుగా, వంటవాళ్లుగా స్థిరపడతారని బిజెపి నాయకులు ప్రకటనలు చేయడం దివాళాకోరుతనమన్నారు. ఇప్పటిదాకా సైన్యంలో పనిచేసి వచ్చిన వారికి సమాజంలో ఒక గౌరవం వుండేదని ఇకపై ఆ పరిస్థితి వుండదని అన్నారు. చాలీచాలని వేతనాలతో జీవనం కష్టంగా మారితే చోటుచేసుకునే పరిణామాలను ఊహించడమే కష్టంగా ఉందన్నారు.

అగ్నిపథ్‌ ఉపసంహరించుకునేదాకా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలకు వామపక్ష పార్టీలు సంపూర్ణంగా మద్దతును ఇస్తాయని చెప్పారు. అమెరికాలో కాంట్రాక్టు పద్దతిలో సైనికులు వుంటారని చెప్పేవారు ఇప్పటిదాకా అమెరికా ఏ యుద్దంలో విజయం సాధించిందో చెప్పాలన్నారు. వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఇలా ఏ దేశంలోనూ అమెరికా గెలవలేకపోవడానికి కారణం అందులో వుండే కాంట్రాక్టు సైనికులేనని అన్నారు.

సైన్యంలో ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు నో ర్యాంక్‌-నో పెన్షన్‌ అంటోందని విమర్శించారు, సైనిక శక్తిని నిర్వీరం చేసే అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా అగ్నిపథ్‌ నిరసన కార్యక్రమంలో పోలీస్‌ కాల్పుల్లో మృతిచెందిన రాకేష్‌కు ఈ సదస్సు సంతాపం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్, ఎన్నకుస కుమార్, జోగు ప్రకాష్, కొలిపాక యాకయ్య, మునిగేల రమేష్, బెల్లంకొండ వెంకటేష్, భూక్యా చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.