సూర్యాపేట జిల్లా : చెత్తను తొలగించకపోవడంతో రోడ్డుపై చిందరవందరగా చేస్తున్న పందులు
ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
సూర్యాపేట జిల్లా కేంద్రం నెహ్రూనగర్ జనావాసాల నడుమ పందులు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలకు అంటురోగాలు ప్రబలుతున్నాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు.సూర్యాపేట పట్టణoలోని నెహ్రూనగర్,రాజీవ్ నగర్, ఇంద్రానగర్ తదితర వార్డుల్లో పందులు విచ్చలవిడి గా సంచరిస్తున్నాయని పలు కాలనీలవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల పెంపకపుదారులు సొంత స్థలంలో పెంచాల్సింది పోయి కాలనీల్లో విడిచి పెడుతూ ప్రజలకు ఇబ్బందికల్గిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదడువాపు లాంటి వ్యాధులు సోకినప్పుడు హడావిడి చేయడం, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తప్ప చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని వార్డుల్లో చెత్తను తొలగించకపోవడం వల్ల వర్షాకాలం కావడంతో ప్రతీ ఇంటి నుంచి వచ్చే మురుగు నీరు రోడ్లపై ఖాళీ స్థలoలో పారుతుండడంతో పందులు దానిలో తిరుగుతూ జనావాసాల మధ్యకు వచ్చి యథేచ్చగా స్వైర విహారం చేస్తూ వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. చిన్నారులను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు బయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మురికి కాలువలు నిర్మించాలని, పందుల బెడద తగ్గించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా పెడచెవిన పెడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఒకవైపు స్వచ్ఛ సూర్యాపేటపట్టణాన్ని తీర్చిదిద్దాలని అంటున్న పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముందుగా పందుల పెంపకపుదారులను కట్టడిచేస్తే వ్యాధులు రాకుండా ఉంటాయని, చిన్నారులు మెదడు వాపు లాంటి వ్యాధి బారిన పడకుండా ఉంటారని ప్రజలు కోరుకుంటున్నారు.