పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి.

రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్‌ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాన్ని వేసింది. ఈ పెంచిన ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వస్తాయి. ఇంత భారీ మొత్తంలో వేసిన భారాలను వెంటనే పూర్తిగా ఉపసంహరించాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సీపీఎం జనగామ జిల్లా కమిటీ, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని నెహ్రూపార్క్ కూడలిలో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని రాస్తారోఖో నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు పాల్గొని మాట్లాడుతూ డిస్కాంలు పెట్టిన పెంపుదల ప్రతిపాదనలను ఉన్నదున్నట్టు రెగ్యులేటరీ కమిషన్‌ ఉన్నదున్నట్టు ప్రకటించడమంటే ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించలేదని అర్థమవుతున్నదన్నారు. గృహ వినియోగదారులైన 60 లక్షల మందికి ప్రస్తుతం యూనిట్‌కు రు.1.45 పైసలు కాగా ప్రస్తుతం యూనిట్‌కు 50 పైసలు పెంచి రు.1.95 పైసలు అనగా 34 శాతం పెంచారన్నారు. పరిశ్రమలపైన ప్రస్తుతమున్న యూనిట్‌ ఛార్జీలపై రూపాయి పెంచింది. దీంతో ప్రస్తుత భారానికి 25 శాతం నుండి 30 శాతం వరకు పెంపుదల చేశారని విమర్శించారు. మొత్తం డిస్కాంలకు రావాల్సిన ఆదాయాన్ని 25 శాతం పెంపుదల చూపారని తెలిపారు. టారీఫ్‌ రేట్ల బహిరంగ విచారణలో పాల్గొన్న అనేక మంది ఛార్జీలు పెంచవద్దని, భారాలను ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని శాస్త్రీయంగా వివరించారని అన్నారు. గత నాలుగేళ్ళల్లో డిస్కాంలు రు. 36 వేల కోట్ల అప్పులు చేసాయి. 2022-23 సంవత్సరానికి మరో 11వేల కోట్ల లోటును చూపించారు. కానీ రెగ్యులేటరీ కమిషన్‌ డిస్కాంలు చూపినదానికన్నా 2వేల కోట్ల భారాన్ని చూపడం అత్యంత దుర్మార్గం అని విమర్శించారు. డిస్కాంలు తమ అంతర్గత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఛార్జీలను పెంచాల్సిన అవసరముండదు. కానీ డిస్కాంలు ఛార్జీల పెంపుపైనే దృష్టి పెట్టాయని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉండడంతో నష్టాలు పెరుగుతున్నాయన్నారు. మేనేజ్‌మెంట్‌ ఖర్చులను బాగా పెంచి ఈ నష్టాలను మరింత పెరగడానికి తోడ్పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో అతితక్కువకు లభ్యమవుతున్న విద్యుత్‌ను కొనకుండా, ఎక్కువ రేట్లకు వేలంలో పాడినవారి దగ్గర కొనుగోలు చేస్తున్నారన్నారు. ”ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ డిస్పాచ్‌” ప్రకారం ఎసెండింగ్‌ విధానంతో విద్యుత్‌ను వినియోగించినచో నష్టాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఎసెండింగ్‌కు బదులు డిసెండింగ్‌ ఆర్డర్‌ను విద్యుత్‌ శాఖ అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ విద్యుత్‌ జనరేషన్‌ కంపెనీల నుండి కాకుండా అధిక ధరలకు అమ్మే ప్రయివేటు జనరేషన్‌ కంపెనీల నుండి కొనుగోలు చేయడంతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై వేస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేసి వృధా ఖర్చును తగ్గించడం ద్వారా భారాలు పెంచకుండా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. అందువల్ల పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని, అవసరమైతే మారో బాషిర్ బాగ్ పోరాటం ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, పట్టణ నాయకులు బోట్ల శ్రీనివాస్, ఆర్ మీట్యా నాయక్, జె. ప్రకాష్, బి. చందు నాయక్, కె లింగం, ఎ. సురేష్ నాయక్, గణేష్ నాయక్, ఎం.డి. మునీరుపాషా, పి. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.