అడ్డగోలుగా పెంచుతున్న సినిమా టికెట్ ధరలను తగ్గించాలని డివైఎఫ్ఐ అధ్వర్యంలో ఈరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ గారికి DYFI అలిండియా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, రాష్ట్ర సహయకార్యదర్శి దినేష్ లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతల కోరికమేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని , రేట్స్ పెంపు ప్రేక్షకులకు తీరని భారం అవుతుందని అందువల్ల సినిమా టికెట్ల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి పెద్ద సినిమాల రిలీజ్ పేరుతో సినిమా టికెట్ ధరను పెంచడం సినీ ప్రేక్షకులకు ,ప్రజలకు అధిక భారమే. ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువులు,గ్యాస్,పెట్రోల్,డీజిల్ ఇతర రకరకాల ధరల భారం తో సతమతమవుతున్న పరిస్థితి ఉంది. కరోనా నేపథ్యంలో నష్టపోయిన సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు టికెట్ ధరల పెంపు నిర్ణయం సరైంది కాదు. వారి నష్టం పేరుతో ధరలు పెంచి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపడం సామాన్య ప్రజలు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేయడమే అవుతుంది.
సినిమా ఇండస్ట్రీ నుండి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంటే ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం సరియైంది కాదు. ప్రభుత్వమే సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక రాయితీలను ప్రకటించి ఇవ్వాలి. అంతేకాని సామాన్య ప్రజలకు భారం కాకుండా చూడాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. తక్షణమే పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సినిమా థియేటర్ లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా రేట్స్ పెంచడమేమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికే జిఎస్టీ,నిర్వహణ చార్జీలు భారీగా పెంచారు. ఇవి కూడా ప్రేక్షకులపై మోపడం దుర్మార్గమని అన్ని చార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.