పేదల స్వంత ఇంటి కల సాకారం : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
 • ఈ నెల 25వ తేదీన 2,03,000 ఇళ్ళ పట్టాలను పంపిణి
 • అదే రోజున 1,11,000 ఇళ్ళ నిర్మాణాలకు శ్రీకారం
 • లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు ప్లాట్ల కేటాయింపు
 • అన్ని కులాల లబ్ధిదారులతో ఇంటిగ్రేటెడ్ కాలనీలు
 • రోడ్లు, డ్రైనేజ్, చెట్ల పెంపకాలతో సుందరంగా ఇళ్ళ కాలనీలు
 • *ధర్మవరం మండలం కుణుతూరు వద్ద ఇంటి పట్టాల లేఔట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
 • అనంతపురము, డిసెంబర్ 11 : జిల్లాలోని పేదలకు స్వంత ఇంటి కల సాకారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం ధర్మవరం మండలం కుణుతూరు గ్రామంలో రూపొందించిన ఇళ్ళ పట్టాల లేఔట్ లను జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
 • ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా జిల్లాలో 2,03,000 ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు పంపిణి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే రోజున 1,11,000 ఇళ్ళ నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన ఒకే రోజు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణి చేయడమే కాకుండా, 15 లక్షల ఇళ్ళ నిర్మాణాలకు కూడా శ్రీకారం చుడుతోందన్నారు. ఇళ్ళ పట్టాలను పంపిణి చేసే లేఔట్లలో రోడ్డు వసతి, విద్యుత్ సౌకర్యంతో పాటు అంగన్ వాడి, పాఠశాల భవనాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 • జిల్లాలో ఏర్పాటు చేసిన లేఔట్ లలో అంతర్గత రహదారులను, అప్రోచ్ రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. లేఔట్ లలో 9 మీటర్లు, 6 మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామన్నారు. 9 మీటర్ల రహదారి నిర్మాణంలో 6 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా 1.50 మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. అలాగే 6 మీటర్ల రహదారి నిర్మాణంలో 4 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా ఒక మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. రోడ్లను 6 ఇంచుల మందంతో నిర్మిస్తున్నామన్నారు. లబ్దిదారులందరికి సౌకర్యవంతంగా ఉండేలా లేఔట్ నిర్మాణాలను అత్యంత నాణ్యత, పచ్చదనం, అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ ప్లాటు ఎక్కడ ఉందో సూచించే రాళ్ళను ఏర్పాటు చేయడం, కుటుంబానికి ఉపయోగపడే మొక్కలు, పర్యావరణానికి హితమైన మొక్కలను నాటడం జరిగిందన్నారు.
 • ఈ సందర్భంగా ధర్మవరం మండలం కుణుతూరు గ్రామంలో రూపొందించిన ఇళ్ళ పట్టాల లేఔట్ లో నాటిన మొక్కలను, ప్లాట్లను సూచించే రాళ్ళను, నిర్మించిన రోడ్లను జిల్లా కలెక్టర్ మీడియాకు చూపించారు. ఈ లేఔట్ లో 90 రోజుల్లో ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్లాట్లను కేటాయిస్తున్నామని, ఇప్పటికే 33 మంది లబ్దిదారులను లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. లేఔట్ లలో అన్ని కులాల లబ్ధిదారులతో ఇంటిగ్రేటెడ్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజ్, చెట్ల పెంపకాలతో సుందరంగా ఇళ్ళ కాలనీలను నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అన్ని వసతులు సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇళ్ళ పట్టాలను ప్రభుత్వo ఉచితంగా అందిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1.50 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.05 సెంటు భూమిని అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటిని రూ.1,80,000/-ల ఖర్చుతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మెటీరియల్ సరఫరాకు టెండర్ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా స్థాయి టెండర్ కమిటీ ద్వారా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే మెటల్, సిమెంట్ ఇటుకలు, కిటికీలు, ఇతర సామాగ్రిని తక్కువ ధరకే లబ్దిదారులకు అందిస్తామన్నారు. నిన్నటి రోజున జిల్లా స్థాయి టెండర్ కమిటీ సమావేశoలో టెండర్లను పిలిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
 • ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. బయట మార్కెట్ లో ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.375/-లు వుందని, ప్రతి లబ్దిదారునికి రూ.7,500/-లు ఉచితంగా అందించినట్టు అవుతుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ఇసుకను ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇసుక రీచ్, స్టాక్ యార్డ్, డిపోల నుండి రవాణా చార్జీలు మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి సైతం జిల్లా స్థాయిలో సేకరించి లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 92 సిమెంట్ బస్తాలు అవసరమన్నారు. ఒక సిమెంట్ బస్తా ధర మార్కెట్ లో రూ.360/- నుండి 370/-లు ఉంటే గృహ నిర్మాణ లబ్దిదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్ ను ఒక్కొక్క సిమెంట్ బస్తాపై దాదాపు రూ.125/-లను తగ్గించి, 92 సిమెంట్ బస్తాలను మార్కెట్ ధరకన్నా తక్కువకే అందించడం జరుగుతుందన్నారు. తద్వారా సిమెంట్ పై సుమారు రూ.11,500/-ల మేర లబ్ధి కలుగుతుందన్నారు.
 • లబ్దిదారుల మోముల్లో ఆనందం – ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా
 • కుణుతూరు గ్రామానికి చెందిన ఇళ్ళ పట్టాలను కేటాయించిన లబ్దిదారుల మోముల్లో ఆనందం తొణికిసలాడుతోందని, ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా వారిలో స్పష్టంగా కనబడుతోంది. ఈ సందర్భంగా నాగమణి, జైమూన్ బీ, వీరనారమ్మ, దిల్షాద్ బీ, దీప, ఇతర లబ్దిదారులు మీడియాతో మాట్లాడుతూ తాము 15 సంవత్సరాలుగా అద్దె ఇంటిలో నివసిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ళుగా స్వంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందనే తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తమకు ఈ నెల 25వ తేదీన ఇళ్ళ పట్టాలను అందించనుండడంతో తమ కల నెరవేరడంతోపాటు ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా తమకు కలిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
 • ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్.డి.ఓ. మధుసూదన్, నోడల్ అధికారి వరప్రసాద్, ధర్మవరం తహసిల్దార్ నీలకంఠా రెడ్డి, హౌసింగ్ డిఇ చంద్రశేఖర్, ఎపిడి పుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.