పేద ముస్లిం మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి -ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

స్వంత ఇల్లు లేని పేద ముస్లిం మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, చిరు వ్యాపారులకు నిరుద్యోగులకు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని, పాత బస్తీలో వసతులు మెరుగుపరచాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేసారు.
ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం మైనార్టీల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షత వహించారు. ధర్నా లో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవాజ్ మైనారిటీల సమస్యలను తెలుసుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించిందన్నారు. హైదరాబాద్ పాత బస్తీ లో ముస్లింల స్థితిగతులు చాలా అధ్వాన్నంగా
ఉన్నాయి. తరతరాలుగా అద్దె ఇళ్లలో ఉంటూ, పెరుగుతున్న అద్దెలు భరించలేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు. సుధీర్ కమీషన్ నివేదిక ప్రకారం పాత నగరం లో 48 శాతం కుటుంబాలకు స్వంత ఇల్లు లేదని, ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇల్లు వీరికి అందడం లేదని అన్నారు. అరకొరగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళు ప్రజాప్రతినిధుల మధ్య పంపకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మా దృష్టికి తెచ్చారని, అర్హులకు అందడం లేదన్నారు. క్రింద స్థాయిలో ప్రభుత్వం నేరుగా సర్వేలు నిర్వహించి అర్హులైన పేదలకు అందేలా చూడాలని కోరారు.
ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాల లాంటి ప్రచారార్బాట కార్యక్రమాలు కాకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషనుకు నిధులు పెంచి నిరుద్యోగ యువతకు, ఫుట్ పాత్ వర్కర్స్, స్ట్రీట్ వెండార్స్, ఆటో డ్రైవర్స్, మెకానిక్స్ లాంటి వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పాత బస్తీలో నాలా, మంచినీటి సౌకర్యం, రోడ్లు నిర్మాణం వంటి మౌళిక వసతుల అభివృద్ధి కి 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ సిరాజ్ ఆమెరాఖాన్, ముస్లిం హక్కుల సంఘం నాయకురాలు షమీమ్ సుల్తానా, రిజ్వానా ఖాద్రి
తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు నసీరుద్దీన్, బాబా తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం హైదరాబాద్ డిఆర్ఓ కు వినతి పత్రం అందజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.