- ఆవాజ్
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు వీరోచితంగా పోరాటం చేసిన రైతాంగానికి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ జేజేలు పలుకుతున్నది. పార్లమెంటులో మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు, విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నది.
గత సంవత్సర కాలంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పోరాటం చేస్తున్నది. కేంద్రం ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులపై తీవ్ర నిర్బంధం ప్రయోగించాయి. లాఠీలు, తూటాలు, నీటి ఫిరంగులు ప్రయోగించి అణిచివేసేందుకు ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు, దేశ ద్రోహులు అని ముద్రలు వేశారు. బిజెపి, సంఘ్ పరివారానికి చెందిన ప్రైవేటు దళాలతో దాడులు చేయించి, వాహనాలతో తొక్కించి రైతులను చంపారు. భయబ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేసారు. అయినా రైతులు తమ పట్టు సడలించలేదు. పోరుబాట వీడలేదు. 750 మంది రైతులు ప్రాణాలు త్యాగం చేసారు. వారికి నివాళులు అర్పిస్తున్నాము. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధృడ సంకల్పంతో రైతులు చేసిన సమరం నిరంకుశ పాలకుల మెడలు వంచి, నల్లచట్టాలను రద్దు చేసేలా చేసింది. ఇది దేశ చరిత్రలో రైతులు సాధించిన ఘనవిజయం. పోరాడి గెలిచిన రైతులకు అభినందనలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో రైతాంగ పోరాట స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలి. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఆవాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది