అమ్మాయి ఆత్మహత్య

కట్టుకున్నవాడు తప్పించుకున్నాడు.. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మన్నారు.. పెళ్లిచేసుకున్న ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్‌లో చోటు చేసుకుంది.కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్‌ (20) ప్రేమించుకున్నారు.
ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్‌ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. ఆ తరువాత పెళ్లాడిన మనోహర్ కూడా రాలేదు. సఖి సెంటర్‌లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ.. టాయిలెట్‌ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
‘అబ్బాయి తల్లి తండ్రి నా పెళ్లికి ఒప్పుకోలేదు.. అబ్బాయి కూడా చేసుకున్నాడు కానీ తల్లిదండ్రులకు భయపడి రావడం లేదు.. నా చావుకి కారణం వీరు’ అంటూ రాసి ఉంది. శ్రీలేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు మనోహర్‌, అతడి తల్లిదండ్రులు అనిత, ఎల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.