బడ్జెట్లో 5000కోట్లు కేటాయించి నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలి

ఇఫ్తార్ విందులు,రంజాన్ తోఫాలు కాదు బడ్జెట్ సబ్ ప్లాన్ చట్టం, బడ్జెట్లో 5000కోట్లు కేటాయించి నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.
ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

27 మార్చి 2022, రోజున తెలంగాణ ముస్లిం మైనార్టీ సంఘాల జాక్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రలో ముస్లిం మైనార్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఆయన వెల్లడించి,కార్యాచరణను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం రంజాన్‌ నెలలో ఇఫ్తార్ విందుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. 8 కోట్లు, రంజాన్ తోఫాల కోసం రూ. 21 కోట్లు కేటాయించిందని, ఇవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఉపయోగిపడేవి కాదు కాబట్టి ఇఫ్తార్ విందులను, తోఫాలను ముస్లిం సమాజం తిరస్కరించి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలని కోరారు.
2022 – 23 వార్షిక బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1740 కోట్లు మాత్రమే కేటాయించిందని రాష్ట్రంలో 14% జనాభా ఉన్న మైనార్టీలకు ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడం అన్యాయం అన్నారు. కావున పునర్ సమీక్ష జరిపి మైనార్టీ బడ్జెట్ ని రూ. 5000 కోట్లకు పెంచాలని,రోడ్ సైడ్ చిన్నసన్న వ్యాపారులను (పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, చాయ్ డబ్బాలు, మెకానిక్ లు, ఆటో- కార్ డ్రైవర్లు తదితరులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి రూ. 2 లక్షల సబ్సిడి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత 8 సంవత్సరాలుగా మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ లో ఖర్చు కాకుండా మిగిలిన దాదాపు రూ. 4000 వేల కోట్లకు పైగా నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ సంవత్సరం ఖర్చు చేయాలని కోరారు. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని,
వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ కల్పించాలని కోరారు.
మైనారిటీ గురుకులాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని, అందుకు వక్ఫ్ భూములను వాడుకోవాలని సూచించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పేద ముస్లింలకు 12% కేటాయించాలని, మైనార్టీ కమీషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలను నియమించాలని కోరారు. మతోన్మాద, విచ్ఛిన్నకర మూకల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడాలని సూచించారు.
ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మార్చి 31 వ తేదీన అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపు నిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో
తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం హక్కుల నేత, ఓయూ జాక్ నాయకులు సయ్యద్ సలీంపాషా,
తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం రిజర్వేషన్ పోరాట నాయకులు, రచయిత, చమన్ పత్రిక సంపాదకులు యూసుఫ్ షేక్ (స్కైబాబ),
జాక్ రాష్ట్ర నాయకురాలు షాహీన్ సుల్తానా తదితర ముస్లిం మైనార్టీల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.