బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగులకు మొండిచెయ్యి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందని, తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించి, వికలాంగుల బందు ప్రకటించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డి) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్పిఆర్డి జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద బడ్జెట్ ప్రతులతో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ 2,56,958 కోట్ల బడ్జెట్లో 5 శాతం ప్రకారం 12847.92 కోట్లు వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించాలని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం 2021-22 బడ్జెట్లో కేటాయించిన 11,728 కోట్ల నిధులనే ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరానికి కూడా 11,728 కోట్ల
నిధులు మాత్రమే ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం కేటాయించిందని విమర్శించారు. 2018 నుండి ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 3 లక్షల 51వేల మంది ఉండగా, వీరందరికీ ఏప్రిల్ నుండి పింఛన్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, నిధులు కేటాయించకుండా క్రొత్త పింఛన్లు మంజూరు ఎలా చేస్తారని ప్రశ్నించారు? ఆసరా లబ్ధిదారులను మోసం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో స్త్రీ, శిశు, మహిళా, వికలాంగుల సంక్షేమానికి 1702 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో ఎలాంటి నిధులను ప్రభుత్వం కేటాయించక పోవడం చుస్తే వికలాంగుల పట్ల కేసీఆర్ కు ఎంత నిర్లక్ష్యమో అర్ధమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో వికలాంగులు కేవలం ఆసరా పెన్షన్ దారులుగానే కనిపిస్తున్నారని అన్నారు. వివిధ వ్యాపారాల్లో రిజర్వేషన్ అమలు చేసే దానిలో వికలాంగుల ప్రస్తావన లేకపోవడం ద్వారా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి బడ్జెట్ కేటాయింపులు నిదర్శనమని విమర్శించారు. అనేక కులాల వారికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం సామాజికంగా, శారీరకంగా, ఆర్థికంగా వెనుకబడిన వికలాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్న వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం వికలాంగుల వివాహ ప్రోత్సాహానికి ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు. స్వయం ఉపాధి కోసం అర్హులైన వికలాంగులకు 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని, అలాగే స్వయం ఉపాధి పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పరికరాల కోసం అనేకమంది వికలాంగులు ఎదురుచూస్తుంటే బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం ద్వారా ఉపకరణాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలిందని హెద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే బడ్జెట్ ఉందనిపిస్తుందని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ఉన్నా 2016 ఆర్.పి.డి, మానసిక వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, నేషనల్ ట్రస్టు వంటి చట్టాలు అమలుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు రూపొందించి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తుంది, కానీ ఈ బడ్జెట్లో దానికోసం ఎలాంటి నిధుల్ని కేటాయించక పోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి ప్రచారం తీసుకువచ్చే అనేక పథకాలకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం మీద ఉన్న శ్రద్ధ వికలాంగుల సంక్షేమ మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మాటలు చెబుతున్న దానికి ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి వికలాంగుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, వికలాంగుల బందు ప్రకటించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, ఉప్పరి వేణు, మామిడాల రాజేశ్వరి, ఇట్టబోయిన మధు, రాములు, బైరగోని మహేష్, మోతె వెంకటమ్మ, గొడుగు రాజవ్వ, కానుగు బాలనర్సయ్య, కామరాతి వినయ్, ఒండ్రు శ్రీశలం, నాచు అరుణ, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.