బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసరకు బయలుదేరారు. ట్రీపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు వినేందుకు బండి సంజయ్ బాసరకు వెళ్తున్నారు.
హైదరాబాద్ నుంచి భారీ అనుచరగణంతో బాసరకు పయనమయ్యారు.
కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక సందర్భంగా జిల్లాల్లో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమమైన డిమాండ్లు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రెండు రోజుల క్రితమే చలో బాసరకు బీజేవైఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద వరుసగా నాలుగో రోజు విద్యార్థులు ఆందోళనను చేపట్టారు. వేలాదిమంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు బాసర క్యాంపస్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులను అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తాము బయటకు కనిపించకుండా బారికేడ్లు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండో గేట్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అడుగు అడుగునా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.
పోలీసుల అలర్ట్.
బాసరకు బండి సంజయ్ రాక నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ నుంచి భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. బస్సుల నిలిపివేతతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.