భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు

గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసి, కరకట్టను పరిశీలించారు.

అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు.

బాధితులను పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.

భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

వరదలు వచ్చిన ప్రతిసారీ భద్రాచలం ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం పట్టణ వాసుల కన్నీళ్లను తుడిచేందుకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

వరద చేరని, అనువైన ఎత్తైన ప్రదేశాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కాలనీల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముంపునుంది తమకు శాశ్వత ఉపశమనం దొరకుతుండటంతో వరద బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.