మన్యం వీరుడి ఆశయాలను కొనసాగించాలి: నోముల కిషోర్

హన్మకొండ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధనకు మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని డివైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ఈసి సెంటర్ లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత జాతీయోద్యమం ఎంతో మహోన్నతమైందని, సీతారామరాజు, భగత్‌సింగ్‌ వంటి నాయకులు చిన్న వయస్సులోనే ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. బ్రిటిష్‌ హయాంలో మన్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు ఉద్యమించారని తెలిపారు. మన్యం ప్రజలను సంఘటిత పరిచి చేసిన పోరాటం మహోన్నతమైందని చెప్పారు. అల్లూరి సీతారామరాజును అడ్డుకునేందుకు ఆ ప్రాంత కలెక్టర్‌గా రూధర్‌ఫర్డ్‌ను అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిందని, ఆయన ప్రభుత్వానికి నివేదించిన అంశాల ఆధారంగా మన్యం ప్రజలు ఎంత దోపిడీకి గురవుతున్నారో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అయితే మన్యం ప్రజలు నాటికి, నేటికి ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ వెనకబడే ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. సమాజంలో ఈ అంతరాలను రూపుమాపడానికి అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లకొండ శ్రీకాంత్, దాసరి నరేష్, మాచర్ల సతీష్, రాంఖి, చామంతి, శ్వేతా, శైలజ, అనిల్, యువన్ జంపయ్య, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.