మాల, మాదిగ పల్లెలు ఇక ఉండవ్

: దేశంలో ఫస్ట్ ఏపీలోనే.. కలెక్టర్ చంద్రుడు సంచలనం

అనంతపురం జిల్లాలో కులాలను సూచించే కాలనీల పేర్లు మార్చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రూటే సపరేటు. కలెక్టర్‌గా ఆయన పంథానే వేరు. జిల్లాకు వచ్చాం.. అందరిలానే పని చేసి వెళ్లిపోదాం అని కలెక్టర్ గంధం చంద్రుడు అనుకోలేదు. మనం చేసే పనులు వచ్చే తరాలకు మార్గదర్శకంగా ఉండాలని అనుకున్నారు. అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా, వినూత్నంగా, విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చంద్రుడు చేస్తున్న పనులు ప్రజలను ఒక నిమిషం ఆపి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంతే కాదు.. జిల్లా నుంచి ఢిల్లీ వరకు ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గంధం చంద్రుడు.. తాజాగా, మరో సంచలనం రేపారు. మాల పల్లె, మాదిగ పల్లె, హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.
అనంతపురం నుంచే మార్పు మొదలు!

దేశంలో తొలిసారిగా అనంతపురం జిల్లాలో కులాలను సూచించేలా ఉన్న కాలనీల పేర్లు మార్పు ద్వారా కలెక్టర్ గంధం చంద్రుడు సామాజిక విప్లవం ప్రారంభించారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 480 కాలనీల పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టారు. మాల పల్లె, మాదిగ పల్లె.. ఇలా కులాల పేర్లతో ఉన్న కాలనీల పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో గత నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో కూడా కులాల పేరుతో ఉన్న కాలనీల పేర్లు తొలగించాలని స్పష్టం చేసింది.

మార్పునకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ చంద్రుడు

వందల సంవత్సరాలుగా దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష వేళ్లూనుకుని మహమ్మారిలా విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో కులాల పేర్లతోనే వీధులు ఉంటాయి. మాల పల్లె, మాదిగ పల్లె, హరిజనవాడ, దళిత వాడ, గిరజన వాడ ఇలా.. వివిధ పేర్లతో ఎస్సీ, ఎస్టీలు అంటరానివారుగా గ్రామ శివార్లకే పరిమితమైపోతున్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా, మనిషి ఆధునికతను సంతరించుకుంటున్నా ఇంకా కులం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.

కాలనీలకు మహానుభావుల పేర్లు

అనంతపురం జిల్లాలో ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, చాకలి వీధి, ఇలా అనేక రకాలుగా కులాల పేర్లతో ఉన్న ఆయా కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గౌతమ బుద్ధ, జగ్జీవన్ రామ్, ఇందిరమ్మ, గాంధీ, నెహ్రూ, నేతాజీ, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, మదర్ థెరిస్సా.. ఇలా స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మహానుభావుల పేర్లు పెట్టారు.

203 కాలనీలకు అంబేడ్కర్ పేరు
203-
ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 390 ఎస్సీ కాలనీలకు పేర్లు మార్చినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. 203 ఎస్సీ కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్నారని వివరించారు. అలాగే 39 కాలనీలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) పేరు లేదా ఆ ట్రస్ట్ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్, ఆయన కుమారుడు మాంచో ఫెర్రర్ పేర్లు పెట్టుకున్నట్లు వివరించారు. కాగా, అనంతపురం జిల్లా ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఫెర్రర్ కుటుంబం స్వచ్ఛంద సేవలందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఆర్‌డీటీ సంస్థ తన సేవలను ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాంతాల పేర్లు మార్చేందుకు చర్యలు చేపట్టారు.

పాఠశాలల పేర్లూ మార్పు!

అలాగే కులాల పేర్లతో ఉన్న బడుల పేర్లను సైతం మార్చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అన్ని కులాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకునేలా పాఠశాలల పేర్లు మారుస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ చంద్రుడు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ధైర్యసాహసాలతో కూడుకున్నదని, ఎస్సీ, ఎస్టీలపై వివక్షను రూపుమాపేందుకు ఇది దోహదం చేస్తుందని శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

గంధం చంద్రుడు వినూత్న పంథా

జిల్లాకు ఎంతో మంది కలెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ, కొందరు కలెక్టర్లు మాత్రమే ప్రజల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఉన్నతస్థితి కోసం ప్రజలు చకోరపక్షుల్లా ఎదురుచూస్తుంటారు. మార్పు చేయాల్సిన వారు, చేయగలిగిన వారు మాకెందుకు అనే ధోరణితో ముందుకెళ్తున్నారు. అయితే కలెక్టర్‌గా అడుగుపెట్టిన గంధం చంద్రుడు మాత్రం అలా అనుకోలేదు. ఆయన తొలిసారిగా అనంతపురం జిల్లా కలెక్టర్ అయ్యారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే.. అట్టడుగు పేద కుటుంబానికి చెందిన గంధం చంద్రుడు ఎంతో కష్టపడి చదివారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆయన ఆగిపోలేదు. బాగా చదివి టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించారు. అక్కడితో ఆయన సంతృప్తి చెందలేదు. తన గమ్యం ఇది కాదని భావించి మరింత కష్టపడ్డాడు. ఐఏఎస్ లాంటి ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆ తర్వాత పలు చోట్ల పని చేసి జిల్లా కలెక్టర్‌గా అనంతపురం వచ్చారు.

​ఆ దురాచారానికి చరమగీతం

కలెక్టర్‌గా గంధం చంద్రుడు జిల్లాలో ఓ దుస్సాంప్రదాయానికి చరమగీతం పాడి ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాలో కొన్ని వందల ఏళ్ల నుంచి ఒక సాంఘిక దురాచారం ఉంది. ఎవరైనా అధికారులు వద్దకు వెళ్లేటప్పుడు పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడటం! ఇలాంటి దుస్సాంప్రదాయాన్ని రూపుమాపేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు సెల్ఫ్ రెస్పెక్ట్ (ఆత్మగౌరవం) పోస్టర్‌ను విడుదల చేశారు. ఎవరైనా అధికారుల వద్దకు వచ్చినప్పుడు పాదరక్షలు వదిలేయడం కానీ, చేతులు కట్టుకుని నిలబడటం చేయవద్దని తెలియజేసే పోస్టర్లు ప్రతి కార్యాలయంలో ఉండేలా చేశారు. దీని వల్ల ఆ సంస్కృతి చాలా వరకు తగ్గింది.

బాలికల ఉన్నతి కోసం సంచలన నిర్ణయం

జిల్లా కలెక్టర్‌గా గంధం చంద్రుడు చూసిన సామాజిక రుగ్మతల్లో మరోకొటి బాలికలు తమ చదువును మధ్యలోనే ఆపేయడం. అలాగే ఇప్పటికీ బాలికలపై కొనసాగుతున్న వివక్ష. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం.. వీటన్నింటినీ చూసి ఆయన కదిలిపోయారు. ఈ దురాచారాలను మార్చడం ఒక్క కలెక్టర్ వల్ల మాత్రమే అవుతుందా? అందరూ కాదనుకుంటారు.. కానీ, ఆయన మాత్రం ఓ అడుగు ముందుకేశారు. ఆయన చేపట్టిన కార్యక్రమం దేశంలో అందరినీ కదిలించింది.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో చదువుకునే బాలికలను ఒక్క రోజు అధికారిగా మార్చే కార్యక్రమం చేపట్టారు. అంటే జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామాల్లో ఉన్న చిన్న స్థాయి అధికారి వరకు ఒక్కరోజు బాలికలను అధికారులుగా మార్చడం! అంతే కాదు వారి దృష్టికి వచ్చిన సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపితే వాటిని అమలు చేసేలా కూడా ఆయన ఆదేశిలిచ్చారు. కలెక్టర్ చేసిన ఈ పని ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఆలోచింపజేశాయి. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రముఖుల ప్రశంసలు అందుకునేలా చేశాయి. బాలికల్లో ఆత్మస్థైర్యం, ప్రోత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమాన్ని మనమెందుకు చేయకూడదన్న ఆలోచన రగిలించింది. ఇలా, కలెక్టర్ గంధం చంద్రుడు తనదైన సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.