మైనారిటీ డ్రైవర్లకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలి

ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మైనారిటీ ఆటో డ్రైవర్లుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలని కోరుతూ ఆవాజ్ రాష్ట్ర ప్రతినిధి బృందం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ మైనారిటీలలో అనేక మంది ఆటోలు నడుపుతూ ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని, స్వంత ఆటోలు లేక కిరాయి ఆటోలు నడుపుతూ, గిరాకీ సరిగా లేక, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి కిరాయి చెల్లించలేక, కుటుంబాలు గడవక ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రైవేటు ఫైనాన్సియర్స్ వద్ద అప్పులు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసిన వారు ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక, ప్రైవేట్ ఫైనాన్సియర్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ఆటో డ్రైవర్లను గుర్తించి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ వల్ల బిజినెస్ దెబ్బ తిన్న డ్రైవర్లను ఆదుకోవాలని, వారికి కనీసం ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని గతంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిని కలిసి వినతిపత్రం సమర్పించామని, మైనారిటీ సంక్షేమం శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి నిధుల కోసం లేఖ రాసి మూడు సంవత్సరాల గడిచినా ఇప్పటికి ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి మైనారిటీ ఆటో డ్రైవర్ కు ఆటో కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం అందించాలని, బిజినెస్ లేక ఇబ్బందులు పడుతున్న పేద మైనారిటీ డ్రైవర్లకు 30వేల ఆర్థిక సహాయం అందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ని కోరారు. ఆవాజ్ ప్రతినిధి బృందంలో సంఘం రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ సత్తార్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ యాకూబ్, ఆటో డ్రైవర్లు మహమ్మద్ అహ్మద్ పాషా, మహమ్మద్ హర్షద్ తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.