మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు సంవత్సరాల తరబడి అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల సరియైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర ప్రతినిధి బృందం జనగాం జిల్లాలోని మైనారిటీ గురుకులాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నది. ఈ సందర్భంగా మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ మైనారిటీ
రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అన్నారు. ఇంకా ఎంతకాలం అద్దె భవనాల్లో కొనసాగిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అద్దె భవనాలు రెసిడెన్షియల్ స్కూల్ కోసం నిర్మాణం చేసినవి కాదు కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాలలకు అనుకూలంగా లేవు, పిల్లలకు తగిన సౌకర్యాలు ఉండటం లేదని అన్నారు. లక్షల రూపాయల అద్దెలు చెల్లించినప్పటికీ విద్యార్థులకు
సంతృప్తికరమైన వసతులు అందడం లేదన్నారు. అద్దె భవనాల యజమానులకు అద్దె తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ భవనాల నిర్వాహన మీద లేదని విమర్శించారు. కనీసం భవనాలకు మరమ్మతులు చేయడం, సున్నం వేయడం కూడా చేయడం లేదని విమర్శించారు. సంవత్సరానికి 30కోట్ల రూపాయలు అద్దె రూపంలో ఖర్చు అవుతుంది, అయినా విద్యార్థుల సరైన సౌకర్యాలు అందడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలలకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా స్కూల్ వాతావరణం ఉండాలంటే ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించి, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను విద్యార్థులు ఆహ్లాదకరంగా చదువుకునే కేంద్రాలుగా తీర్చి దిద్దాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణను నివారించడంలో ఉద్యోగులు విఫలం చెందారు. ఇలాంటి ఘటనలు తల్లితండ్రులను ఆందోళనలకు గురిచేస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ అజారుద్దీన్, యాకూబ్, యూసఫ్ తదితరులు ఉన్నారు.
