ఈ దేశపు యువత వేగుచుక్క DYFI ఆల్ఇండియా 11వ మహాసభలు వెస్ట్ బెంగాల్ లోని కలకత్తా సాల్ట్ లేక్ లో ఈ నెల 12 నుండి 15వరకు జరుగుతున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని DYFI రాష్ట్ర కార్యాలయంలో ఆల్ఇండియా మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. విజయ్ కుమార్ మాట్లాడుతూ DYFI ఏర్పడి 41 ఏళ్ళు ఇన్ని ఏళ్లలో యువగుండే చప్పుడైంది..నాటి నుండి నేటి వరకు యువహృదయాలలో చేరి హృదయ తంత్రులను మీటి ఉద్యమ గీతాలను సృష్టించింది. అన్యాయపు ,ఆక్రమణకు తిరగబడ్డ యువ డప్పు అయ్యి డమరుకం మోగించింది. తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటింది DYFI. చలిని తరిమిగొట్టే వెచ్చని రగడయ్యింది యువతకి. నిద్రిస్తున్న నిర్జీవ సమాజానికి కణాలను పురిగొల్పి జీవకళ తొణికిసలాడింపచేసింది DYFI. యువత వేదన ,ఆవేదన ,ఆక్రందన ,ఆవేశపు నిప్పురవ్వల్ని తన గళం ద్వారా మండించింది DYFI.మొత్తం దేశపు యువగొంతుకై నిలిచింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో భగత్ సింగ్ లాంటి వీరుల ఆశయ వారసత్వం తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI 1980 లో పంజాబ్ లోని లూథియానా లో నవంబర్ 1,2,3 తెదేలలో జరిగిన సమావేశాల్లో మహాసభలను జరుపుకుని 3 వ తేదీన అన్ని రాష్ట్రాల యువజన సంఘాలను తనలో ఇముడ్చుకొని దేశపు యువత విస్తృత సంఘంగా DYFI ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 లక్షల యువత సభ్యత్వంతో ప్రారంభం అయ్యింది. స్వేచ్చకు ,స్వచ్ఛతకు చిహ్నంగా తెల్లని జెండాను ,త్యాగాలకు గుర్తుగా ఎర్రని చుక్కని కలుపుకొని DYFI జెండా రూపొందింది. అటు తర్వాత 10 మహాసభలు జరుపుకుని నేటికి 41ఏండ్లు గడిచాయి. ప్రస్తుతం కోటి యువజనుల సభ్యతంతో 11 వ మహాసభలను జరుపుకుంటుందని వారు తెలిపారు.
“అందరికి విద్య -అందరికి ఉపాధి ” అనే అంశాలు తీసుకొని అన్ని రాష్ట్రాల్లో అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రజాస్వామ్య హక్కులకై నిలబడింది. హక్కులు అడిగితే రావు లాక్కోవాలని యువతను చైతన్యం చేస్తుంది.గల్లీ నుండి ఢిల్లీ దాకా ,పల్లె నుండి పట్టణం దాకా ఎన్నో ఉద్యమాలను ఆర్గనైజ్ చేసింది. ఆ క్రమంలో ఎందరో తన కార్యకర్తలను కోల్పోయింది. ఈ దేశ సమైక్యతా, సమగ్రత కోసం ఎన్నో త్యాగాలు చేసింది. కశ్మీర్ సమగ్రత కోసం , పంజాబ్ ,అస్సాం విభజన వాదులను ,ఉగ్రవాదులను కూడా ఎదుర్కొంది. యువత ఉగ్రవాదం వైపు మరలకుండా శాయశక్తులా ప్రయత్నించింది. ఆ క్రమంలో అనేక మంది యువకార్యకర్తలు హత్య గావింపబడ్డారు. ఆ క్రమంలోనే ఈ దేహం ముక్కలు అయినా – దేశం ముక్కలు కానివ్వం అనే నినాదం ఇచ్చింది. నినాదాన్ని ఆచరణలో నిజం చేసింది.
కులాంతర ,మతాంతర సమాజానికి తీవ్రంగా యత్నిస్తూ మతోన్మాదనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరంతర పోరాటం చేస్తుంది. దేశాల పై సామ్రాజ్య వాద దేశాల పెత్తనాన్ని వ్యతిరేకిస్తోంది. అంతే కాకుండా యువతకు ఆటల్లో ,పాటల్లో చేదోడుగా ఉంటూ DYFI వారిని ముందుకు నడిపిస్తుందని ,గ్రామ ,బస్తే శ్రమ దానాలు చేస్తూ పరిశుభ్రత కు పాటుపడుతూ సమాజం పట్ల యువత బాధ్యతను గుర్తుచేస్తుందని ఆయన ప్రకటించారు.
ఇలా యువత కోసం పనిచేస్తున్న DYFI మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
పోస్టర్ ఆవిష్కరణ లో DYFI రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శులు కృష్ణా నాయక్, జావేద్ లు , రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు లు, నాయకులు రమేష్, బలరాం, రమేష్ లు పాల్గొన్నారు.