రజక వృత్తిదార్లకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్ధిక ఉపాధి చూపాలి


సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్

రజకవృత్తినే నమ్ముకుని చాలిచాలని ఆదాయంతో దుర్బరమైన జీవితాలు గడుపుతున్నరజక చేతి వృత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్ధిక ఉపాధి చూపాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు. మంగళవారం హైదరాబాద్ హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ రాజ్ బహదూర్ గౌర్ హాళ్ళలో తెలంగాణ రజక వృత్తిదారుల సమైఖ్య కార్యవర్గ సమావేశం రాష్ట్ర కన్వీనర్ బొడ్డుపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని తెలంగాణ రజక వృత్తిదారుల సమైఖ్య నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు కావస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రజక చేతి వృత్తిదారుల జీవన పరిస్ధితులలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. సామాజిక భద్రత, వత్తి రక్షణ లేని ఈ వృత్తి సమస్యల మీద ప్రభుత్వం అధ్యయనం చేయవలసిన అవసరముందని అయన తెలిపారు. రజకులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, రజకుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ అలాగే ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, పోలీస్‌శాఖ, గురుకుల మోడల్‌ స్కూళ్లలో బట్టలు శుభ్రం చేసే పనిని రజక వృత్తిదారులకు ఇవ్వాలని అయన కోరారు. రజక వృత్తిదారుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాషెర్ మాన్ ఫెడరేషన్ నూతన బోర్డును ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, వెంటనే వాషెర్ మాన్ ఫెడరేషన్ నూతన బోర్డును ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన, రిజిస్టర్డ్ సొసైటీ నిధులు విడుదల చేయాలనీ అయన డిమాండ్ చేసారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వం పై వత్తడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వృత్తి సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి న్యాయమైన కోర్కెల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని అయన డిమాండ్ చేసారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేటికీ చేతి వృతుదారుల ఆర్థిక పురోగతిలో ఏమి మార్పు రాలేదని అవే దుర్భరమైన బ్రతుకులు వెళ్లదీస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. రజక చేతి వృతుదారులు ‌సంఘటితంగా సమస్యల పరిష్కరానికి ముందుకు సాగాలని బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. పాండురంగ చారి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్, తెలంగాణ రజక వృత్తిదారుల సమైఖ్య నాయకులూ దీటి నరసయ్య, పగిళ్ల జోజి, దండు నిరంజన్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.