–ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
సూర్యాపేట జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బహుజనులు రాజ్యాధికారంలోకి రావడం తధ్యమని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఆదివారం మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామంలో జరిగిన ఆదర్శ వివాహ వేడుకకు హాజరైన ఆయన ముందుగా బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం అంబేద్కర్ సాక్షిగా ఆదర్శ వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఆర్.ఎస్.పి వస్తున్నారని సమాచారం అందుకున్న మునగాల మండల బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, బహుజన బిడ్డలు 65వ జాతీయ రహదారిపై ఉన్న మొద్దులచెర్వు స్టేజి వద్దకు చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికి,మొద్దుల చెర్వు స్టేజి నుండి విజయరాఘవాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆర్.ఎస్.పి మీడియాతో మాట్లాడుతూ విజయరాఘవాపురం గ్రామానికి చెందిన యువకుడు అంబేద్కర్ సాక్షిగా ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు.ప్రతీ ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దళిత బహుజన బిడ్డలను తల్లిదండ్రులు బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు.మునగాల మండలంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారని, వీరి ఉత్సాహం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించడం ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.