తెలంగాణ సాహితి సంస్థ నిర్వహణలో త్వరలో హైదరాబాద్ లో మూడు రోజుల పాటు లిటరరీ ఫెస్ట్ జరుగనుంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ సాహితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆ సంఘం కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలలో చైతన్యం నింపే శక్తి పాటకే ఉంది. అలాంటి పాటకు పట్టాభిషేకం చేయాలనే లక్ష్యంతో జానపద వాగ్గేయ సాహిత్యం, సినీసాహిత్యం పై ఆగష్టు మొదటి వారంలో రాష్ట్రస్థాయిలో లిటరరీ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు తెలియజేసారు. ఈ సందర్భంగా జానపద వాగ్గేయకారుల నుండి పాటలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సినీ సాహిత్యం పై విశ్లేషణాత్మక వ్యాసాలను ఆహ్వానిస్తున్నామన్నారు. వీటితో పుస్తకాలను ప్రచురించనున్నట్లు తెలియజేసారు. ఆసక్తిగల రచయితలు తమ పాటలను వ్యాసాలను తెలంగాణ సాహితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ వారి వాట్సాప్ నంబర్లు 9573187218, 8977336447 లకు పంపించగలరని కోరడం జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగ్గేయకారులు, సినీగీత రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు రాష్ట్రస్థాయి లిటరరీ ఫెస్ట్ లో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్ కృష్ణ, ప్రముఖ సాహితీవేత్తలు పల్లేరు వీరస్వామి, నల్లెల రాజయ్య నవ తెలంగాణ బుక్ హౌస్ మేనేజర్ బండారి బాబు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోగిల చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు కార్తీక రాజు, కాసుల రవికుమార్, మేకిరి దామోదర్, శంకర్ నారాయణ, గుండు కరుణాకర్, కవులు కళాకారులు యోచన, రెలారే విజయ్, మ్యాదరి సునీల్, తాడిచెర్ల రవి, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.