#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

విచ్చలవిడిగా బెల్టు షాపులు

సిండికేట్ మద్యం మాఫియా ను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం

బెల్టు షాపులకోసం మండల కేంద్రంలో ప్రత్యేకంగా రెండు బ్రాంది షాపులు

E69న్యూస్,రేగొండ
మద్యం మాఫియాను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని
మండలంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో వైన్ షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలో మూడు మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా అందులో రెండు షాపులలో ఎమ్మార్పీ ధరకు మించి అధిక ధరకు విక్రయిస్తూ, ప్రత్యేకంగా బెల్టుషాపులకే రెండు బ్రాంది షాపులను కేటాయించిన వైనం మండల కేంద్రంలో జరుగుతున్నది.మండలంలోని గ్రామాల బెల్టు షాపులకు బాటిల్ కు నూట యాభై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ, గ్రామ గ్రామాన ఆటో ట్రాలీల ద్వారా బెల్ట్ షాపులకు ఎగుమతి చేస్తున్నారు. మండలంలోని వైన్ షాప్ యజమానులు సిండికేట్ గా మారి ఈ దందాను నడిపిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని మద్యం ప్రియులు వాపోతున్నారు.మండల కేంద్రంలో ఉండవలసిన మద్యం విక్రయాలు గ్రామాల్లో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా కొనసాగుతుండంతో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో బెల్టుషాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. సమయపాలన లేకుండా వైన్స్ షాప్ లను సాయంత్రం 6 గంటల వరకే బంద్ చేస్తుండటంతో మద్యం ప్రియులు గత్యంతరం లేక బెల్టు షాపులను ఆశ్రయిస్తున్నారు. దాంతో క్వాటర్ సీసాకు 40 రూపాయల చొప్పున అధికంగా డబ్బులు చెల్లించవలసి వస్తున్నదని వాపోతున్నారు.
ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు కానీ, వైన్ షాపు యజమానుల పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు షాపు వారు తమ వైన్ షాప్ లో కాకుండా వేరే వైన్ షాప్ లో కొనుగోలు చేస్తే ఆ మధ్యాన్ని పట్టుకొని వెళ్తున్నారని బెల్టు షాపు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా విచ్చలవిడిగా వెలియడంతో మద్యం ఏరులై పారుతున్నది. నిరుపేదలు, కూలీలు, యువకులు లిక్కర్ కు అలవాటు పడుతూ మద్యానికి బానిసలై,పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితం తెల్లారిపోతున్నది.మద్యం మత్తులో కుటుంబ కలహాలు ఎక్కువై ,సంసారాలు బజారున పడుతున్నాయి. మూడు వైన్ షాపులు కూడా జనావాసాల మధ్య ఉండడంతో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జడిసిపోతున్నారు.ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తు వీడి,అధిక ధరలు విక్రయిస్తున్న బ్రాండి షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, జనావాసాల మధ్య ఉన్న వైన్ షాపుల ను వెంటనే తరలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.