నేడు కనువిందు చేయనున్న నెలవంక
ముస్లింలు అత్యంత పవిత్రంగా.. కఠోర నియమాలతో చేపట్టే రంజాన్ ఉపవాసాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించాక అదే రోజు రాత్రి నుంచే ఖురాన్ పఠనం, తరావి నమాజు ప్రారంభిస్తారు. మరుసటి రోజు తెల్లవారు జామునుంచి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. ఉగాది పర్వదినం రోజే రంజాన్ మాసం సూచికగా నెలవంక కనిపించనుండటం విశేషం. నెల రోజుల పాటు ఉపవాసాలకు ముస్లింలు సిద్ధం అవుతున్నారు. పవిత్ర మాసంలో నమాజుల కోసం మసీదులను ముస్తాబు చేశారు. వేకువ జామున ఉపవాస దీక్ష ప్రారంభించడం కోసం సహర్‌కు.. సాయంత్రం దీక్ష విడిచే సమయం ఇఫ్తార్‌కు ప్రత్యేక వంటకాలను అందించడం కోసం హోటళ్లు కూడా సిద్ధం అయ్యాయి. ఈ మాసంలో ప్రత్యేకమైన హరీస్, హలీమ్ వంటకాలకోసం ప్రత్యేక దుకాణాలు సైతం వెలుస్తాయి. ఈ వంటకాలంటే ముస్లింలే కాకుండా అన్ని వర్గాలవారు ఇష్టపడతారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, మక్తల్, నారాయణపేట, కోస్గి, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు.