జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం గాంధీనగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన హైవే పెట్రోలింగ్ వాహనం గణపురం మండలం గాంధీనగర్- మైలారం గ్రామాల వద్ద 353 జాతీయ రహదారిపై ఇసుక లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై పోరిక హరిలాల్, డ్రైవర్ దబ్బెట అశోకు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తలించారు. ఐతే తీవ్ర గాయాలపాలైన ఏఎస్సై పోరిక హరిలాల్ నాయక్ ను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిచగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరంగల్ శివనగర్ కు చెందిన హరిలాల్ నాయక్ గత మూడు సంవత్సరాల నుండి రేగొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో ఎంతో కలివిడిగా ఉండే ఏఎస్సై హరిలాల్ నాయక్ మరణ వార్త తో మండల ప్రజలు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. సౌమ్యుడైన తమ తోటి సహచరుడు అకాల మృత్యువాత పడటంతో రేగొండ పోలీసు సిబ్బంది దుఃఖ సాగరంలో మునిగి పోయారు.
