వెలికట్ట ఉప సర్పంచ్ పై నెగ్గిన అవిశ్వాసం
  • ఘర్షణ వాతావరణం నడుమ అవిశ్వాస తీర్మానం
  • ఉప సర్పంచ్ సంధ్య కు వ్యతిరేకంగా 8 మంది వార్డు సభ్యుల అవిశ్వాసం

తొర్రూరు:
 కొత్త చట్టం ప్రకారం మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాసం గురువారం నెగ్గింది. గత నెల 18న ఉప సర్పంచ్‌ దీకొండ సంధ్య పనితీరు బాగాలేదని తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో 8 మంది వార్డు సభ్యులు ఆమెపై అవిశ్వాస ఫిర్యాదు చేశారు. దీంతో గత పదిరోజుల క్రితం పాలకవర్గానికి అవిశ్వాస నోటీసులను అందజేశారు. దీంతో గురువారం వెలికట్ట పంచాయతీ కార్యాలయం వద్ద ఇన్ చార్జ్ ఆర్డీఓ కొమురయ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ బి భారతి, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీఓ గౌస్ అవిశ్వాస పరీక్షను నిర్వహించారు.
10 మంది వార్డు సభ్యులుండగా 8 మంది సభ్యులు చేతులు లేపడంతో సంధ్య పై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇట్టి విషయాన్ని కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. అనంతరం నూతన ఉప సర్పంచ్‌ ఎన్నికకై త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పదవి కాలంలో రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలని, మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు రెండో తీర్మానాన్ని పెట్టకూడదన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాక జిల్లా కలెక్టర్
ఉప సర్పంచ్‌ను పదవి నుంచి తొలగిస్తాడన్నారు.
ఘర్షణా వాతావరణం నడుమ అవిశ్వాసం…
ఉప సర్పంచ్ దీకొండ సంధ్య పై
అవిశ్వాస తీర్మానం విషయం బయటకు పొక్కడంతో గ్రామ పంచాయతీ వద్ద ఉప సర్పంచ్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో స్థానికులు పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి చొచ్చుకొని రావడం, పంచాయతీ కార్యాలయ తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ప్రతిఘటించారు. ఆందోళన సద్దుమణిగక పోవడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. సిఐ కరుణాకర్ రావు, ఎస్సై నగేష్, అదనపు ఎస్ఐ మునీరుల్లా లు పరిస్థితిని చక్కదిద్దారు.  అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అవిశ్వాస తీర్మానం కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పోసాని పుష్పలీల, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.  

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.