వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి వ్యవసాయాన్ని కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివి: 06-03-2021 శనివారం రోజున జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్బంగా దేశ వ్యాప్త నిరసనలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులు దేశ రాజధానిలో రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయాన్ని కాపాడాలని ఉద్యమం 100 రోజులుగా చేస్తూ 248 మంది రైతులు చనిపోయారని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం తప్ప దేశ రైతాంగాన్ని కాపాడాలనే ఆలోచన లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసి రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చే రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మోడీ ప్రభుత్వం అన్నం పెట్టె రైతులకు సున్నం పెట్టాలని చూస్తుందని ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. రైతాంగం గిట్టుబాటు ధరను చట్టబద్దం చేయాలని అనేకసార్లు జరిపిన చర్చల్లో విన్నవించుకున్నా మోడీ పరివారం సమస్య పరిష్కారం వైపు దృష్టి చూపకుండా అన్నదాతల పోరాటం మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే 5లక్షల ట్రాక్టర్లతో, లక్ష నాగళ్లతో ఢిల్లిని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఎదునూరి వెంకట్రాజం, ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, KGKS రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి, Sfi జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ధర్మబిక్షం, బోడ నరేందర్, CITU జిల్లా ఉపాధ్యక్షులు జోగు ప్రకాష్, NPRD జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్,మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగేల రమేష్, మంగ బీరయ్య, సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.