గొర్రెలను, మేకలను ఖుర్బానీ ఇవ్వండి
బక్రీద్ శాంతియుతంగా జరుపుకొని
బక్రీద్ సందర్భంగా మతోన్మాద శక్తులు వివాదాలు సృష్టించడానికి అవకాశం ఇవ్వకుండా గొర్రెలను, మేకలని ఖుర్బానీ ఇవ్వడం ద్వారా శాంతియుతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు.
బక్రీద్ శుభాకాంక్షల, మజీద్ ల సమయం తెలియజే పోస్టర్ ను హైదరాబాద్ లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు మతోన్మాద శక్తులు ప్రతి చిన్న అంశాన్ని వాడుకుంటున్నాయని, విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని
అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. కాబట్టి బక్రీద్ సందర్భంగా అలాంటి అవకాశాలకు తావివ్వకుండా గొర్రెలను, మేకలను ఖుర్బానీ ఇవ్వడం ద్వారా శాంతియుత వాతావరణంలో బక్రీద్ ను జరుపుకోవడం ఎంతో సముచితమని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మేధావులు విజ్ఞతతో ఆలోచించి ప్రజలను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, ఆవాజ్ నగర నాయకులు ఖజా గరీబ్ నవాబ్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు