కేంద్రానికి సిపిఎం డిమాండ్
దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనాలంటే సార్వత్రిక, సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్పనిసరి అని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది.
సోమవారం కేంద్రం ప్రకటించిన కొత్త వ్యాక్సిన్ విధానం ప్రభుత్వమే సృష్టించిన ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడేయాల్సిన బాధ్యతనుండి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంగా వుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. మొత్తం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టివేసే ప్రయత్నమే ఇదని పేర్కొంది. కేంద్రం తన బాధ్యతలను విడనాడేందుకు ఉద్దేశించిన, వివక్షతో కూడిన, ప్రమాదకరమైన విధానాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది.
వ్యాక్సిన్ సరఫరాలను పెంచకుండా, అమ్మకాలను సరళీకరించడానికి, ధరలపై నియంత్రణను ఎత్తివేయడానికి మాత్రమే ఈ విధానం ఉద్దేశించబడిందని పేర్కొంది. ప్రజలు ఎదుర్కొంటున్న విపత్తును తగ్గించేందుకు లేదా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడదని స్పష్టం చేసింది.
వివక్షాపూరిత విధానంతో మహమ్మారి పెచ్చరిల్లుతుందని, ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టడం ద్వారానే ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనగలుగుతామని సిపిఎం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సరఫరాలను తగినంత స్థాయిలో పెంచుకోవడానికి కేంద్రం గత ఏడాది కాలంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రాణాలను కాపాడే ఈ వ్యాక్సిన్‌ను తీసుకోలేని కోట్లాది మంది ప్రజలను పక్కకు నెట్టడానికి ఇదొక విధానమని విమర్శించింది.
పైగా, వ్యాక్సిన్లు ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా అందుతున్నాయి. కానీ ఇప్పుడు, ఎలాంటి ధరల నియంత్రణ లేకుండా బహిరంగ మార్కెట్లో రాష్ట్రాలు వ్యాక్సిన్లను ‘సమకూర్చుకోవాల్సి’ వుంటుంది. తాజా విధానం ప్రకారం వ్యాక్సిన్ సరఫరాదారులు తమకు అనువైన ధరలను నిర్దేశించుకోవచ్చు. దాంతో మెజారిటీ ప్రజానీకం వ్యాక్సిన్ వేయించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు రాష్ట్రాలకు కేంద్ర ఖజానా నుండి నిధులు అందచేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. పైగా, ఈ విధానంతో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్‌కు, అక్రమ నిల్వలకు బీజాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలకు సామూహికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉచితంగా, సార్వత్రికంగా చేపట్టాలని, స్వతంత్ర భారతావని వారసత్వం, సాంప్రదాయం ఇదేనని సిపిఎం పేర్కొంది.