రిజర్వేషన్ల పితామహుడు సాహుమహారాజ్ 148 వ జయంతి కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా స్థానిక బీ క్యాంపు నందు గల యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి సాహుమహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ దళిత బహుజనులకు సామాజిక న్యాయం, ప్రజాస్వామిక తాత్విక పునాది ఏర్పరచి ప్రజల రాజుగా నిలిచిపోయిన మహనీయులు సాహుమహారాజ్ అని ఆమె అన్నారు. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మరియు కుల,మత వ్యవస్థల వల్ల మహిళల పై జరుగుతున్న అమానుషాన్ని సాహుమహారాజ్ వ్యతిరేకించారు. సాహుమహారాజ్ తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను నేర్పించారు. అంతేకాక ఆమెకు సంగీతంలో, చిత్రాలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించి ఆమె ద్వారా మహిళలకు బాలికలకు ఉపాధి రంగాలలో శిక్షణ ఇప్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి , స్త్రీ పక్షపాతి సాహుమహారాజ్ అని ఆమె తెలిపారు. కొల్లాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా వెనకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించి బాలికల విద్యకొరకు పాటుపడిన మహనీయులు,దళిత బహుజనులకు ఆదర్శనీయులు సాహుమహారాజ్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరస్వతి, శారా, సావిత్రమ్మ తదితరులు
పాల్గొన్నారు.
